ఫిర్యాదు ఇలా చేయాలి! తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల వేదికలు చురుగ్గా పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్లో మూడు వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండేసి మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇక ఫిర్యాదు విషయానికి వస్తే డబ్బు చెల్లించి కొనుక్కున్న వస్తువులో/ పొందిన సేవల్లో లోపాలు ఉన్నప్పుడు మొదట సంబంధిత సంస్థ దృష్టికి తేవాలి.
వారు న్యాయం చేయకపోతే అప్పుడు ఫోరంలో ఫిర్యాదు చేయాలి. ఓ కాగితం మీద ఫిర్యాదుదారు పేరు, చిరునామా, వృత్తి వివరాలు రాయాలి. తర్వాత ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తున్నామో వారి/సంస్థ వివరాలు రాయాలి. ఫిర్యాదు ఏమిటో పేర్కొంటూ వస్తువు కొన్న/ సేవలు అందుకున్న రసీదు కాపీలనూ లోపాలకు సంబంధించిన ఆధారాలుంటే వాటినీ జతచేయాలి. కలిగిన నష్టం ఎంతో, కోరుతున్న పరిహారం ఏమిటో పేర్కొంటూ చివర సంతకం చేయాలి. జరిగిన నష్టం రూ.20 లక్షల లోపు అయితే జిల్లా ఫోరంలో, 20 లక్షలనుంచి కోటి మధ్య ఉంటే రాష్ట్ర కమిషన్లో, కోటికి మించిన కేసులైతే జాతీయ కమిషన్లో ఫిర్యాదు చేయాలి. ఒకచోట న్యాయం జరగలేదనుకుంటే పై కోర్టుకి అప్పీలు చేసుకోవచ్చును.జాతీయ కమిషన్ తర్వాత సుప్రీంకోర్టుకీ వెళ్లవచ్చు. సంఘటన జరిగిన రెండేళ్లలోపే కేసు వేయాలి. చట్టప్రకారం కేసు నమోదైన మూడు నెలలలోగా కేసును పరిష్కరించాలి. అయితే వివిధ కారణాల వల్ల కేసుల పరిష్కారం ఆలస్యమవుతున్నా మామూలు కోర్టులంత ఆలస్యం మాత్రం కాదు.
0 Comments